Bill Gates: ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అందించే సత్తా ఇండియాకే ఉంది: బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

Indian pharma industry Can produce Vaccine for Entire World
  • భారత ఫార్మా రంగం ఎంతో విస్తరించింది
  • వ్యాక్సిన్ వస్తే ఉత్పత్తికి ఫౌండేషన్ తరఫున సహకారం
  • జనసాంధ్రతను దృష్టిలో పెట్టుకుని ఇండియా మరింత జాగ్రత్తగా ఉండాలి
  • భారత ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాం
  • 'కోవిడ్-19: ఇండియాస్ వార్ ఎగనెస్ట్ ది వైరస్'లో బిల్ గేట్స్
భారత ఫార్మా రంగం ఎంతో విస్తరించిందని, కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ సిద్ధమైతే, ప్రపంచం మొత్తానికి సరిపడా స్థాయిలో తయారు చేయగల సత్తా ఉన్న దేశమని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా కంపెనీలు, మెడికల్ వర్శిటీలు ప్రయోగాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియా ఫార్మా పరిశ్రమ కూడా ఎంతో శ్రమిస్తోందని, భారీ ఎత్తున వ్యాక్సిన్ ను తయారు చేయగల కెపాసిటీ ఇండియన్ కంపెనీలకు ఉందని, ఒకసారి వ్యాక్సిన్ బయటకు వస్తే, ఉత్పత్తి కోసం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

తాజాగా 'కోవిడ్-19: ఇండియాస్ వార్ ఎగనెస్ట్ ది వైరస్' అనే డాక్యుమెంటరీ కోసం మాట్లాడిన ఆయన, ఈ వైరస్ ఎన్నో సవాళ్లను ప్రపంచం ముందు ఉంచిందని, ఇండియాలోని జనసాంధ్రత కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. "ఇండియా ఫార్మా రంగం ఎంతో శక్తిమంతమైనది. ఇక్కడి కంపెనీలు కేవలం భారత దేశానికే కాదు... ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ ను పంపించగలవు. ప్రపంచ దేశాలు తయారు చేస్తున్న అన్ని ఔషధాలు, వ్యాక్సిన్ ల పరిమాణంతో పోలిస్తే, ఇండియాలోనే అధికంగా ఫార్మా ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఈ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ముందుంది" అని గేట్స్ వ్యాఖ్యానించారు.

సీరమ్ తో పాటు బయో-ఈ, భారత్ బయోటెక్ వంటి ఎన్నో కంపెనీలు ఇండియాలో ఉన్నాయని అన్నారు. భారత ప్రభుత్వంతో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం అయిందని, ముఖ్యంగా బయో టెక్నాలజీ విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)తో కలసి పని చేస్తోందని తెలిపారు. కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ ఇండియా తొలి దశలోనే ఉన్నదని, మరింత జాగ్రత్తగా ఉంటే వైరస్ ను విస్తరించకుండా ఆపవచ్చని సూచించారు.

ఇండియాలోని పట్టణ ప్రాంతాల్లో జనసాంధ్రతను గుర్తు చేసిన ఆయన, ఇండియా ముందున్న పెను సవాలు ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రజలు చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటారని, వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజల్లోనూ అవగాహన పెరిగిందని అన్నారు. గతంలో తాము ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలు నిర్వహించామని, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ తమ ఫౌండేషన్ యాక్టివ్ గా ఉందని అన్నారు. కాగా, ఈ కార్యక్రమం డిస్కవరీలో గురువారం సాయంత్రం ప్రసారమైంది.
Bill Gates
India
Farma
Corona Virus
Vaccine

More Telugu News