కరోనాతో మృతి చెందిన మహారాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నీల సత్యనారాయణ్

17-07-2020 Fri 08:14
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • మహారాష్ట్ర తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రికార్డు
  • కవిగా, రచయిత్రిగా గుర్తింపు
Neela Satyanarayan Maharashtra first woman election commissioner
మహారాష్ట్ర తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రముఖ రచయిత్రి, కవి నీల సత్యనారాయణ్ (72) కరోనాతో కన్నుమూశారు. ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. కరోనాతో మృతి చెందిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి ఆమెనే. 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీల ఎన్నో పుస్తకాలు రాశారు. కొన్ని సినిమాలకు సంగీతాన్ని కూడా కంపోజ్ చేశారు. రిటైర్మెంట్ తర్వాత రాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. నీల సత్యనారాయణ్ మృతికి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీతోపాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.