ప్రభుత్వంపై బురదచల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు: అంబటి రాంబాబు

16-07-2020 Thu 21:02
  • ఎన్నికల ముందు మోదీ జుట్టు పట్టుకోవాలనుకున్నారు 
  • ఇప్పుడు ఆయన కాళ్లు పట్టుకోవాలని చూస్తున్నారు
  • తప్పులు బయటపడతాయనే భయంతో రాష్ట్రపతికి లేఖలు ఇస్తున్నారు
  • ఆధారాలు లేకుండానే వారిని అరెస్ట్ చేశారా? 
Ambati Rambabu fires on Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ప్రధాని మోదీ జుట్టు పట్టుకోవాలని చంద్రబాబు చూశారని... ఇప్పుడు ఆయన కాళ్లు పట్టుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై 52 పేజీల తప్పుడు ఆరోపణలతో రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురదచల్లడమే కాకుండా... వారిపై తాము కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టు చెపుతున్నారని విమర్శించారు.

అవినీతి లేని పాలనను అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డిలను తప్పు చేయకుండానే, ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని హత్య చేసేందుకు సహకరించిన కొల్లు రవీంద్రను వదిలిపెట్టాలా? అని అడిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అవినీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రూ. 151 కోట్ల అవినీతికి పాల్పడిన అచ్చెన్నను ఏమీ చేయవద్దా? అని ప్రశ్నించారు. విచారణలో తప్పులు భయటపడతాయనే భయంతోనే రాష్ట్రపతికి లేఖలు ఇస్తున్నారని విమర్శించారు.