హిందీకి 'హిట్' పట్టుకెళుతున్న దిల్ రాజు!

16-07-2020 Thu 16:44
  • ఇప్పటికే 'జెర్సీ'ని రీమేక్ చేస్తున్న దిల్ రాజు 
  • విశ్వక్ సేన్ హీరోగా తెలుగులో వచ్చిన 'హిట్'
  • శైలేశ్ కొలను దర్శకత్వంలోనే హిందీ రీమేక్
Dil Raju to remake Telugu film Hit in Hindi

తెలుగులో పలు సినిమాలు నిర్మిస్తూ, సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా దృష్టి పెట్టారు. నిర్మాతగా అక్కడ కూడా జోరు పెంచుతున్నారు. నాని నటించిన 'జెర్సీ' చిత్రాన్ని ఇప్పటికే హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో హిందీ చిత్రాన్ని నిర్మించడానికి కూడా పూనుకున్నారు.

ఆమధ్య తెలుగులో వచ్చిన 'హిట్' చిత్రాన్ని దిల్ రాజు తాజాగా హిందీలో పునర్నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమా తెలుగులో హిట్టయి, మంచి వసూళ్లు చేసింది. దీంతో ఈ చిత్రాన్ని శైలేశ్ కొలను దర్శకత్వంలోనే దిల్ రాజు హిందీలో నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాత కుల్ దీప్ రాథోర్ తో కలసి ఆయనీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'మంచి యూనివర్శల్ పాయింట్ తో రూపొందించిన చిత్రమిది. అందుకే హిందీలో కూడా రీమేక్ చేస్తున్నాం. హిందీ ప్రేక్షకుల అభిరుచికి, అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా కథకి చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి' అని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళుతుంది.