టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంపై "బ్రేకింగ్ న్యూస్" అంటూ ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి

16-07-2020 Thu 16:39
  • రాష్ట్రపతిని కలిసి ఏపీ సర్కారుపై ఫిర్యాదు చేసిన ఎంపీలు
  • వ్యంగ్యంగా స్పందించిన విజయసాయి
  • జైలుకు పోవాల్సి వస్తుందని టీడీపీ ఆందోళన అంటూ ట్వీట్
Vijayasai Reddy satires on TDP MPs

టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వ పాలన అరాచకంగా ఉందంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. "బ్రేకింగ్ న్యూస్... చంద్రబాబు, లోకేశ్, మాజీ మంత్రుల అవినీతిపై ఎలాంటి విచారణ జరపవద్దని రాష్ట్రపతిని కోరిన టీడీపీ ఎంపీలు" అంటూ టీవీ చానళ్ల తరహాలో స్పందించారు.

"టీడీపీ అవినీతిపై జగన్ ప్రభుత్వం కొనసాగిస్తున్న సమగ్ర విచారణ పూర్తయితే అందరు జైలుకు పోవాల్సి వస్తుందని టీడీపీ నేతల ఆందోళన" అంటూ మరో వ్యాఖ్య చేశారు. కాగా, రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల ఏపీలో సీఎం జగన్ పాలన తప్పుదోవలో నడుస్తోందని, తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.