తెలివిగా నివేదికలు ఇచ్చారంటూ... సచివాలయం కూల్చివేత కేసును రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

16-07-2020 Thu 15:23
  • తెలంగాణలో సచివాలయం కూల్చివేత
  • కోర్టును ఆశ్రయించిన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు
  • ఇప్పటికే ఓసారి స్టే ఇచ్చిన కోర్టు
  • పీసీబీ, మదింపు అథారిటీ నివేదికల సమర్పణ
  • అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
Telangana high court extends stay once again in secretariat issue

తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇప్పటికే ఓసారి స్టే ఇచ్చింది. తాజా విచారణలోనూ స్టేను రేపటి వరకు పొడిగించింది. ఆపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇవాళ జరిగిన విచారణలో కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్రస్థాయి పర్యావరణ మదింపు కమిటీ కోర్టుకు నివేదికలు సమర్పించాయి. ఈ నివేదికలు పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదికలు ఎంతో తెలివిగా రూపొందించినట్టు ఉన్నాయని, దేంట్లోనూ నేరుగా సమాధానం చెప్పలేదని పేర్కొంది. అంతేకాదు, పాత భవనాలను కూల్చడం అంటే కొత్త నిర్మాణం కోసమే కదా? కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరం ఉందా? లేదా? నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడం అంటే ఏంటి? అంటూ కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. తమకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి సమాచారం రాలేదని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ కోర్టుకు విన్నవించారు.

దీనిపై స్పందించిన హైకోర్టు... ఈ వ్యవహారంలో కేంద్రం నుంచి స్పందన కూడా అవసరమని భావించి తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపటిలోగా పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి వ్యవహారాలపై గతంలో ఎన్జీటీలో గానీ, ఇతర హైకోర్టుల్లో గానీ చర్చ జరిగి తీర్పులు వచ్చి ఉంటే వాటి వివరాలు కూడా అందించాలని స్పష్టం చేసింది.