దేవుడే మనల్ని కాపాడాలి: కర్ణాటక ఆరోగ్య మంత్రి సంచలన వ్యాఖ్యలు

16-07-2020 Thu 14:54
  • కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి
  • మహమ్మారికి పేద, ధనిక తేడా లేదు
  • రాష్ట్రంలో కరోనా కేసులు డబుల్ అవుతాయి
Only God can save us says Karnataka Health Minister B Sriramulu

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అందరూ ధైర్యవచనాలు పలుకుతున్నారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే, తాజాగా కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలి' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ''

శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయని... మహమ్మారికి పేద, ధనిక, కులం, మతం లేదని ఆయన చెప్పారు. దీనికి స్థాయి, అంతస్తు అనే తేడా లేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబుల్ అవుతాయని తెలిపారు. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలోని సొంత బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.