కొరటాలతో చేయడానికే మొగ్గు చూపుతున్న బన్నీ

16-07-2020 Thu 14:32
  • ప్రతి సినిమాలోనూ సందేశాన్ని ఇచ్చే కొరటాల 
  • ప్రస్తుతం సుకుమార్ తో 'పుష్ప' చేస్తున్న బన్నీ 
  • అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేస్తున్న శివ
Allu Arjun to work with Koratala

మన దర్శకులలో కొరటాల శివకున్న ప్రత్యేకత వేరు. ప్రతి సినిమాను కమర్షియల్ అంశాల మేళవింపుతో రూపొందిస్తూనే సమాజానికి ఓ చిన్న సందేశాన్ని ఇస్తుంటాడు. పైపెచ్చు, తను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ హిట్లే. అందుకే ఆయనకుండే క్రేజే వేరు. స్టార్ హీరోలంతా ఆయనతో ఒక సినిమా అయినా చేయాలని ఆశపడుతుంటారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఆయనతో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అది త్వరలో సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గా కథను కొరటాల శివ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్యా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక ఆయన చేసేది కొరటాల చిత్రమే అవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోపక్క, 'యాత్ర' ఫేం మహి వి.రాఘవ కూడా బన్నీతో ఓ సినిమా చేయడానికి స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు.