కొవిడ్ న్యూమోనియా నుంచి సత్వర ఉపశమనానికి లంగ్ రేడియేషన్ థెరపీ

16-07-2020 Thu 14:25
  • కరోనా రోగుల్లో తీవ్ర న్యూమోనియా
  • కొవిడ్ రోగుల్లో మరణానికి కారణవుతున్న న్యూమోనియా
  • తక్కువ డోస్ లో రేడియేషన్ సత్ఫలితాలు ఇస్తోందన్న వైద్యులు
Pneumonia in Covid patients can be cured with lung radiation therapy

కరోనా వైరస్ ప్రభావంతో రోగుల్లో తీవ్ర న్యూమోనియా కనిపిస్తోంది. గతంలో నెమ్ము జబ్బు లేనివాళ్లు కూడా కరోనా బారినపడగానే, అనూహ్యరీతిలో వారిలో న్యూమోనియా ఏర్పడుతోంది. వారి ఛాతీ ఎక్స్ రేలు చూసిన వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. కొవిడ్ ద్వారా కలిగే న్యూమోనియా అత్యంత ప్రాణాంతకమని అనేక దేశాల వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, అట్లాంటాలోని ఎమొరీ యూనివర్సిటీ వైద్యులు కొవిడ్ నెమ్మును రేడియేషన్ థెరపీతో నయం చేయవచ్చని గుర్తించారు.

సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ ఉపయోగిస్తారు. ఇప్పుడు కరోనా రోగుల్లో కలిగే న్యూమోనియాను తక్కువ డోస్ లో రేడియేషన్ ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చని అంటున్నారు. ఎమోరీ వర్సిటీ వైద్యులు ఈ మేరకు స్వల్ప అధ్యయనం చేపట్టారు. న్యూమోనియాకు గురైన 10 మంది కరోనా రోగుల ఊపిరితిత్తులను స్పల్ప మోతాదులో రేడియేషన్ కు గురిచేశారు. మరో 10 మంది కరోనా రోగులకు సాధారణ చికిత్స అందజేశారు.

అయితే, రేడియేషన్ థెరపీ అందుకున్నవారిలో న్యూమోనియా లక్షణాలు మాయమయ్యాయి. సగటున మూడ్రోజుల్లోనే వారిలో నెమ్ము జబ్బు తగ్గిపోయింది. రేడియేషన్ ఇచ్చిన రోగుల్లో కాస్త వృద్ధాప్య ఛాయలు ఉన్నవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, ఊపిరితిత్తులు ఓ మోస్తరుగా దెబ్బతిన్నవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ రేడియేషన్ థెరపీ సమర్థవంతంగా పనిచేసిందని ఎమొరీ వర్సిటీ వైద్యుడు డాక్టర్ మహ్మద్ ఖాన్ తెలిపారు.