Jofra Archer: బయో సెక్యూర్ వలయం దాటిన జోఫ్రా ఆర్చర్... రెండో టెస్టుకు జట్టు నుంచి తప్పించిన ఇంగ్లాండ్

  • ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్
  • బయో సెక్యూర్ బబుల్ లో ఆటగాళ్లు
  • విజయవంతంగా ముగిసిన తొలి టెస్టు
  • రెండో టెస్టు ముంగిట నిబంధనలు అతిక్రమించిన ఆర్చర్
Jofra Archer out of second test after breached bio secure protocol

కరోనా భూతం విలయం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ క్రికెట్ మ్యాచ్ ఆరంభం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంతో పకడ్బందీగా బయో సెక్యూర్ విధానంలో ఆటగాళ్లను, క్రికెట్ అధికారులను, ఆటగాళ్లు బసచేసే హోటల్ సిబ్బందిని ఓ సురక్షిత వలయంలో ఉంచి విజయవంతంగా తొలి టెస్టు నిర్వహించింది. ఈ భద్రతా వలయం దాటి బయటి నుంచి ఎవరూ లోపలికి ప్రవేశించడం కానీ, లోపలి నుంచి బయటికి వెళ్లడం కానీ జరగకుండా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. తద్వారా వైరస్ వ్యాప్తి నుంచి ఆటగాళ్లను, అంపైర్లను, ఇతర సిబ్బందిని భద్రంగా కాపాడింది.

అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇంగ్లాండ్ నెంబర్ వన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బయో సెక్యూర్ వలయం నుంచి వెలుపలికి అడుగుపెట్టాడు. దాంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతడిని రెండో టెస్టు నుంచి పక్కనబెట్టింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ఓల్డ్ ట్రాఫోర్డ్ లో నేటి నుంచి జరగనుంది. ఇంగ్లీష్ జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్ గా ఎదిగిన ఆర్చర్ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం ఆతిథ్య జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.

తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. కానీ ఆర్చర్ లేకపోవడం ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహంలేదు. తనపై వేటు పడడాన్ని ఆర్చర్ అంగీకరించాడు.

"నేను చేసిన తప్పిదానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యతో నా ఒక్కడికే కాదు, ఇంగ్లాండ్ జట్టుకు, మేనేజ్ మెంట్ కు ఎంతో నష్టం వాటిల్లుతుందని గుర్తించాను. నేను ఒక్కడ్ని నిబంధనలు అతిక్రమించడం వల్ల బయో సెక్యూర్ బబుల్ ఉన్న ప్రతి ఒక్కరిపైనా ఆ ప్రభావం పడుతుందని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరినీ క్షమాపణలు అడుగుతున్నాను. ఒకరకంగా నేను చేసిన పనితో రెండు జట్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకు కూడా నన్ను మన్నించండి" అంటూ స్పందించాడు.

More Telugu News