Raghu Ramakrishna Raju: మిథున్ రెడ్డి నన్ను అభినందించారు.. జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు: రఘురామకృష్ణరాజు

  • పార్టీకి, ప్రభుత్వానికి గల తేడాను విజయసాయి గుర్తించలేకపోయారు
  • నాకు కేంద్ర మంత్రి పదవి ఖరారైందనే వార్తలో నిజం లేదు
  • నా పదవిని బాలశౌరికి ఇవ్వాలని వైసీపీ సిఫారసు చేసింది
Vijayasai Reddy doesnt know the difference between party and government says Raghu Ramakrishna Raju

పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గుర్తించలేకపోయారని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. విజయసాయి తనకు ఇచ్చిన నోటీసును చదివితే ఈవీవీ సత్యనారాయణ సినిమా చూసినట్టు నవ్వుకుంటారని ఎద్దేశా చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నించినందుకే తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారని... ఈ చర్య పార్టీకి నష్టాన్ని కలిగించవచ్చని చెప్పారు. షోకాజ్ లో పేర్కొన్న అంశాలేవీ పార్టీకి సంబంధించినవి కావని అన్నారు. లోక్ సభలో తాను మాతృభాష గొప్పదనం గురించి మాట్లాడానని... అప్పుడు లోకసభపక్ష నేత మిథున్ రెడ్డి తనను అభినందించారని, అయితే జగన్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

తనకు కేంద్ర మంత్రి పదవి ఖరారైందనే వార్తల్లో నిజం లేదని రఘురాజు చెప్పారు. మంత్రి పదవే ఇవ్వాలనుకుంటే తాను వైసీపీలో ఉన్నా ఇవ్వొచ్చని అన్నారు. పార్టీ నుంచి తనను బహిష్కరించినా... వేరే పార్టీలో  తాను చేరేందుకు నిబంధనలు అంగీకరించవని చెప్పారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న పార్లమెంటరీ సబార్డినేట్ కమిటీ పదవిని వల్లభనేని బాలశౌరికి ఇవ్వాల్సిందిగా వైసీపీ సిఫారసు చేసిందని చెప్పారు.

More Telugu News