Trade Surplus: 18 ఏళ్ల తరువాత... ఇండియాలో వాణిజ్య మిగులు!

  • జనవరి 2002లో 10 మిలియన్ డాలర్ల మిగులు
  • ఆపై గడచిన జూన్ లో 790 మిలియన్ డాలర్ల సర్ ప్లస్
  • కరోనా కారణంగా పడిపోయిన దిగుమతులు
  • భారత్ కు శుభవార్తేనన్న ఎఫ్ఐఈఓ
After 18 Years India in Trade Surplus

గడచిన జూన్ నెలలో భారత్ 18 సంవత్సరాల తరువాత తొలిసారిగా 790 మిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును నమోదు చేసింది. ఎగుమతులతో పోలిస్తే, దిగుమతులే అధికంగా ఉంటూ, ప్రతి ఏటా వాణిజ్య లోటు మాత్రమే కనిపిస్తూ ఉండే భారతావనిలో, కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా దిగుమతులు కనిష్ఠానికి పడిపోయాయి. ఇదే సమయంలో ఎగుమతులు కూడా పడిపోయినప్పటికీ, ఔషధ ఉత్పత్తులు కలిసొచ్చాయి.

క్రూడాయిల్ కు డిమాండ్ తగ్గడం, బంగారం దిగుమతులపై ప్రభావం పడడం, పారిశ్రామిక ఉత్పత్తి పాతాళానికి కుదేలు కావడంతో మార్చి నుంచి అటు ఎగుమతులు, ఇటు దిగుమతులూ తగ్గుతూ వచ్చాయి. ఇదే సమయంలో చైనా-ఇండియా మధ్య సంబంధాలు దెబ్బతినడం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో సప్లయ్ చెయిన్ పై పెను ప్రభావం పడింది. ఇక ఈ ప్రభావం మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగుతుందని అంచనా.

ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా, జీడీపీ ఈ సంవత్సరం 5 శాతానికిపైగా కుచించుకుపోయింది. కరోనా కారణంగా ఈ ఏడాది 6 శాతం ఆర్థిక వృద్ధి నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేసినా, రీసెర్చ్ సంస్థలు మాత్రం ఆ మాత్రం వృద్ధి సాధ్యం కాదని తేల్చి చెబుతున్నాయి.

ఇక గత సంవత్సరం జూన్ తో పోలిస్తే, దిగుమతులు ఈ జూన్ లో 47.59 శాతం పడిపోయి 21.11 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎగుమతులు 12.41 శాతం దిగజారి 21.91 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో స్వల్పంగా ట్రేడ్ సర్ ప్లస్ నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది.

జనవరి 2002లో 10 మిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు నమోదైన తరువాత, మరోసారి ఆ పరిస్థితి కనిపించడం ఇదే తొలిసారి. మిగులు కొద్దిగానే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది శుభవార్త వంటిదేనని ఎఫ్ఐఈఓ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ వ్యాఖ్యానించారు.

More Telugu News