మార్కెట్లోకి అత్యంత చవకైన కొవిడ్ టెస్టింగ్ కిట్.. రూ. 399 మాత్రమే!

16-07-2020 Thu 09:36
  • కోరోష్యూర్ పేరుతో అభివృద్ధి చేసిన ఐఐటీ విద్యార్థులు
  • అన్ని ధరలు కలుపుకుని రూ. 700లోపే లభ్యం
  • విడుదల చేసిన కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్
IIT Delhi launches coronavirus diagnostic kit

కరోనా భయంతో అల్లాడిపోతున్న జనానికి ఇది కొంత ఊరటనిచ్చే విషయమే. ఢిల్లీ ఐఐటీ అత్యంత చవకైన కొవిడ్ టెస్టింగ్ కిట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ. 399 కాగా, ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్, శాంపిల్ కలెక్షన్ వంటి వాటితో కలుపుకుని రూ. 700లోపు లభ్యమవుతుంది.

కోరోష్యూర్ పేరుతో ఢిల్లీ ఐఐటీకి చెందిన 9 మంది రీసెర్చ్ విద్యార్థులు దీనిని అభివృద్ధి చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, సహాయమంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ  కార్యదర్శి అమిత్ ఖరే, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రామ్‌గోపాలరావు కలిసి నిన్న దీనిని విడుదల చేశారు. ఈ కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం ఉంది. న్యూటెక్ మెడికల్ డివైజెస్ సంస్థతో కలిసి దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఈ కిట్‌లో వాడిన అన్ని రకాల పరికరాలు దేశీయంగా తయారైనవేనని ఐఐటీ డైరెక్టర్ రామ్‌గోపాలరావు తెలిపారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు పరిశోధనలు చేపట్టామని, అశ్వగంధ ఔషధం వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించినట్టు ఆయన వివరించారు.