వేతనం లేకుండా ఉద్యోగులకు ఐదేళ్ల నిర్బంధ సెలవు: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం!

16-07-2020 Thu 08:57
  • ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యలు
  • నిర్ణయాధికారం సీఎండీ రాజీవ్ భన్సాల్ కు
  • ఉద్యోగులను మదిస్తున్న రీజనల్ డైరెక్టర్లు
Air India Decission on Employees

ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) రాజీవ్ భన్సాల్ కు అప్పగిస్తూ, ఎయిర్ ఇండియా బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది.

ఉద్యోగుల సూటబిలిటీ, ఎఫిషియన్సీ, కాంపిటెన్సీ, క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, హెల్త్ తదితరాలతో పాటు ఇటీవలి కాలంలో పెట్టిన సెలవులు తదితరాలను మదించి ఎవరిని సెలవులపై పంపించాలన్న విషయమై సిఫార్సులు చేస్తారని ఏఐ అధికారులు వెల్లడించారు. బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం, తొలుత ఆరు నెలలపై ఉద్యోగులను సెలవుపై పంపించే అధికారం రాజీవ్ బన్సాల్ దే. ఆపై సెలవును రెండు సంవత్సరాలకు, ఆపై అవసరమైతే ఐదేళ్ల వరకూ పొడిగించేందుకు కూడా సీఎండీకి అధికారం ఉంటుంది.

ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయాల హెడ్స్, రీజనల్ డైరెక్టర్లు తమ పరిధిలోని ఉద్యోగుల పనితీరును మదించనున్నారు. వారి పేర్లను హెడ్ క్వార్టర్స్ లోని పర్సనల్ విభాగం జీఎంకు పంపుతారు. ఆపై దాన్ని సీఎండీ అనుమతి నిమిత్తం పంపనున్నారు. కాగా, ఎయిర్ ఇండియాను విక్రయించాలని కేంద్రం భావిస్తున్న సమయంలో సంస్థ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.