మరిదితో వివాహేతర సంబంధం.. అడ్డొస్తున్నాడని భర్తను హతమార్చిన ఇల్లాలు!

16-07-2020 Thu 08:55
  • అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య
  • తల్లి అంత్యక్రియలకు కుమారుడు రాకపోవడంతో గ్రామస్థుల అనుమానం
  • విషయం బయటపడుతుందని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న నిందితురాలు
Wife murdered Husband with the help of lover

మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఇల్లాలు అతడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరుకు చెందిన బైండ్ల చెన్నయ్య (38), శశికళ దంపతులు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ప్రవీణ్, పావని అనే పిల్లలున్నారు. శశికళ గత ఆరేళ్లుగా వరుసకు మరిది అయిన రమేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. విషయం తెలిసిన భర్త చెన్నయ్య భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించిన శశికళ ప్రియుడితో కలిసి పథకం వేసింది.

ఈ నెల 6న భర్త, ప్రియుడితో కలిసి పరిగి వచ్చారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి అనంతగిరి ప్రాంతానికి చేరుకుని మద్యం తాగారు. మద్యం తాగి మత్తులోకి జారుకున్న చెన్నయ్యపై రాళ్లతో దాడిచేసి కిరాతకంగా చంపేశారు. అనంతరం మృతదేహంపై చెట్ల ఆకులు కప్పి అక్కడి నుంచి జారుకున్నారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 11న చెన్నయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలకు కుమారుడు హాజరు కాకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు శశికళను నిలదీసి పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. దీంతో భయపడిన శశికళ 13న రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా గాయపడిన శశికళ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో ఏదో జరిగి ఉంటుందని భావించిన గ్రామస్థులు శశికళతో సన్నిహితంగా ఉండే రమేశ్‌ను నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.