Andhra Pradesh: కారుపై ఎమ్మెల్యే స్టిక్కరు.. అందులో రూ.5.27 కోట్లు.. ఒంగోలుకు చెందిన ముగ్గురి అరెస్ట్

  • ఏపీ నుంచి చెన్నైకి గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం
  • ఎలావూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము
  • కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో అనుమానాలు
Rs 5 crore seized from car near Chennai

ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో భారీ మొత్తంలో డబ్బును తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ నుంచి చెన్నైకి కొందరు వ్యక్తులు గంజాయిని పెద్దమొత్తంలో రవాణా చేస్తున్నట్టు ఆరంబాక్కం తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిన్న తెల్లవారుజామున తమిళనాడులోని గుమ్మడిపూండి సమీపంలోని ఎలావూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వచ్చిన కారును ఆపి తనిఖీ చేసిన పోలీసులు వెనక సీట్‌లో ఉన్న నాలుగు సంచులను గుర్తించి బయటకు తీశారు. వాటిని తెరిచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది.

మొత్తం 5.27 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. అలాగే, కారులో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్, వసంత్, కారు డ్రైవర్ సత్యనారాయణను అరెస్ట్ చేశారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోయంబత్తూరు సెంట్రల్ ఆర్టీవీ పరిధిలోని వి.రామచంద్రన్ అనే వ్యక్తి పేరిట కారు రిజిస్టర్ అయినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News