కరోనాను జయించిన శతవసంతాల వృద్ధుడు.. కోలుకున్న రోజే బర్త్‌డే.. ఆసుపత్రిలో వేడుకలు!

16-07-2020 Thu 07:13
  • కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు
  • 15 రోజుల్లోనే పూర్తిగా కోలుకున్న వైనం
  • చాలా ఆనందంగా ఉందన్న ఆసుపత్రి సూపరింటెండెంట్
100 Old corona patient got victory against corona virus in Mumbai

కరోనా బారిన పడ్డ వందేళ్ల వ్యక్తి కోలుకోవడమే కాకుండా 101వ వసంతంలోకి అడుగుపెట్టాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైన అర్జున్ గోవింద్‌కు నూరు సంవత్సరాలు. ఇటీవల ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 1న ముంబైలోని బాలాసాహెబ్ థాకరే ట్రామా కేర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అక్కడే గత రెండువారాలుగా చికిత్స పొందుతున్నారు.

ఆయన పూర్తిగా కోలుకోవడంతో నిన్న రాత్రి డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి వైద్యులు భావించారు. అయితే, నిన్ననే ఆయన 101వ వసంతంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిన సిబ్బంది, వైద్యులు ఆసుపత్రిలోనే బర్త్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, 15 రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విద్యా మాన్యే అన్నారు.