చిరంజీవి సినిమాకి దర్శకుడు మారుతున్నాడా?

15-07-2020 Wed 17:12
  • మలయాళ సినిమా 'లూసిఫర్' రీమేక్  
  • 'సాహో' ఫేం సుజీత్ దర్శకుడిగా ఎంపిక
  • దర్శకుడి పనితనం పట్ల చిరంజీవి అసంతృప్తి
Sujeeth replaced from Lucifer remake

చిరంజీవి నటించే సినిమా నుంచి దర్శకుడు మారుతున్నాడా?
ఇప్పుడిదే ఫిలిం నగర్లో వినిపిస్తున్న కొత్త వార్త. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన హిట్ సినిమా 'లూసిఫర్'ను తెలుగులో చిరంజీవి కథానాయకుడుగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకుడిని మారుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా సుజీత్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నాడు. అయితే, సుజీత్ పనితనం ఎందుకో చిరంజీవికి సంతృప్తికరంగా లేదనీ, దాంతో అతనిని తప్పించి మరొక సీనియర్ దర్శకుడిని తీసుకునే యోచన చేస్తున్నారనీ ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తలో వాస్తవముందా? నిజంగానే మరొకరిని రీప్లేస్ చేస్తున్నారా? అన్నది తెలియాలంటే నిర్మాతల నుంచి కానీ, దర్శకుడు నుంచి కానీ అధికార ప్రకటన రావలసిందే.