రాజస్థాన్‌లో ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్.. అన్ని కార్యవర్గాలు రద్దు

15-07-2020 Wed 16:35
  • రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గాలను రద్దు చేసిన అధిష్ఠానం
  • త్వరలోనే కొత్త ముఖాలతో కొత్త కార్యవర్గాలు
  • కిందిస్థాయిలో సచిన్ అనుయాయులు పేరుకుపోయారనే..
Congress abolished all working groups in Rajasthan

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై అసంతృప్తితో రగిలిపోతూ తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఈ దెబ్బతో కిందిస్థాయి నుంచి ప్రక్షాళన ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గాలను రద్దు చేసింది. త్వరలోనే పూర్తిగా కొత్త వారితో కార్యవర్గాలను ప్రకటిస్తామని ఈ సందర్భంగా పార్టీ పేర్కొంది.

సచిన్ పైలట్ మద్దతుదారులు కింది స్థాయి వరకు ఉన్నారని భావిస్తున్న పార్టీ.. వారందరినీ తొలగించి పూర్తిగా కొత్త ముఖాలతో అన్ని కార్యవర్గాలను ప్రకటించేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాష్ట్ర కార్యవర్గంతోపాటు జిల్లా, మండల స్థాయి కార్యవర్గాలు కూడా రద్దవుతాయని, త్వరలోనే ఏఐసీసీ వాటిని పూరించే ప్రక్రియ చేపడుతుందని రాజస్థాన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే తెలిపారు.