Mukesh Ambani: 5జీని తీసుకొస్తున్నాం: 43వ వార్షిక సమావేశంలో పలు వివరాలను వెల్లడించిన ముఖేశ్ అంబానీ 

  • 5జీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం
  • ప్రపంచ స్థాయి టెక్నాలజీని జియో డెవలప్ చేసింది
  • మూడేళ్లలో 50 కోట్ల మొబైల్ వినియోగదారులకు కనెక్ట్ అవుతాం
Jio developing homegrown 5G telecom solution says Mukesh Ambani

ఇండియాలో 4జీ గత చరిత్ర కాబోతోంది. 5జీ టెక్నాలజీని దేశీయంగా పూర్తి స్థాయిలో అభివృద్ది చేశామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఈరోజు తెలిపారు. ముంబైలో జరిగిన రిలయన్స్ 43వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రయల్స్ ను ప్రారంభిస్తామని  చెప్పారు. వచ్చే ఏడాది క్షేత్ర స్థాయిలోకి 5జీని తీసుకొస్తామని తెలిపారు. జియోలోకి 5జీని తీసుకువస్తుండటం ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పారు.

20 మంది స్టార్టప్ పార్ట్ నర్లతో కలిసి 4జీ, 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్, డివైజెస్, ఆపరేటింగ్ సిస్టమ్, బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్/వీఆర్, బ్లాక్ చైన్, నేచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్, కంప్యూటర్ విజన్ వంటి టెక్నాలజీలను జియో ప్లాట్ ఫామ్స్ అభివృద్ది చేసిందని తెలిపారు.

వరల్డ్ క్లాస్ టెక్నాలజీలకు దీటుగా జియో ప్లాట్ ఫామ్స్ ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేసిందని ముఖేశ్ వెల్లడించారు. ఈ టెక్నాలజీల సాయంతో మీడియా, ఫైనాన్సియల్ సర్వీసెస్, కామర్స్, విద్య, హెల్త్ కేర్, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, స్మార్ట్ మొబిలిటీ వంటి వైవిధ్యభరితమైన రంగాలకు ఉపయోగపడే సొల్యూషన్స్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ టెక్నాలజీని ప్రస్తుతానికి మన దేశానికే వినియోగిస్తామని.. ఆ తర్వాత ఇతర దేశాలకు తీసుకెళ్తామని చెప్పారు.

రానున్న మూడేళ్ల కాలంలో 50 కోట్ల మొబైల్ వినియోగదారులకు జియో కనెక్ట్ అవుతుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. 100 కోట్ల స్మార్ట్ సెన్సార్లు, 5 కోట్ల హోమ్, బిజినెస్ వ్యవస్థల (ఎస్టాబ్లిష్ మెంట్లు)కు అనుసంధానమవుతుందని చెప్పారు. మొబైల్ బ్రాడ్ బ్యాండ్, జియో ఫైబర్, జియో ఎంటర్ ప్రైస్ బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ బ్యాండ్ ఫర్ ఎస్ఎంఈ, జియో నేరో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే  ఐదు డిజిటల్ కనెక్టివిటీలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో జియో అద్భుతాలను సృష్టించబోతోందని తెలిపారు.

More Telugu News