పార్టీ నుంచి బహిష్కరించడంపై స్పందించిన సంజయ్ ఝా

15-07-2020 Wed 13:59
  • కుటుంబాలకు, వ్యక్తులకు నేను బద్ధుడిని కాను
  • పార్టీ భావజాలానికి మాత్రమే కట్టుబడి ఉంటా
  • పార్టీలోని ప్రాథమిక సమస్యలను లేవనెత్తుతూనే ఉంటా
Suspended Congress leader Sanjay Jha Responded

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్‌కు మద్దతుగా మాట్లాడి, పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన సంజయ్ ఝా స్పందించారు. తాను వ్యక్తులకు, కుటుంబాలకు బద్ధుడను కానని పేర్కొన్న ఆయన కేవలం కాంగ్రెస్ భావజాలానికి మాత్రమే బద్ధుడిగా ఉంటానన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్నారంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు గత అర్ధరాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ప్రాథమిక సమస్యలను తాను ఎల్లప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందంటూ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.