సంబంధం లేని విషయాల్లో కాలు, వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్: విజయసాయిరెడ్డి

15-07-2020 Wed 13:45
  • గజపతుల కుటుంబ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు
  • జోక్యం చేసుకుని దోచేసింది మీరే
  • సంచయిత గజపతుల కుటుంబ సభ్యురాలు కాదా?
Vijayasai Reddy fires on Chandrababu

గజపతులకు చెందిన మాన్సాస్ ట్రస్టు వ్యవహారం ఏపీలో రాజకీయపరమైన వేడిని పుట్టిస్తోంది. ట్రస్టును ఇన్ని రోజులు దోచేశారంటూ టీడీపీపై వైసీపీ విమర్శలు గుప్పిస్తుండగా... లక్ష కోట్ల విలువైన ట్రస్టు భూములను కొల్లగొట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి, ఆయన స్థానంలో ఆనందగజపతిరాజు కుమార్తె సంచయితను నియమించారు. ఈ క్రమంలో, వివాదం మరింత ముదిరింది.

ఈ అంశానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గజపతుల కుటుంబ వ్యవహారాలు, ట్రస్టులో జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది మీరేనని టీడీపీపై ఆరోపణలు చేశారు. సంబంధం లేని విషయాల్లో కాలు, వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటారు చంద్రబాబూ? అని ప్రశ్నించారు. సంచయిత గజపతుల కుటుంబ సభ్యురాలు కాదా? లేదా మహిళలంటే మీకు చిన్న చూపా? అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఇదే సమయంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా సరికొత్త ఆరోపణలు చేశారు. 'తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!' అని ట్వీట్ చేశారు.