ias: ఐఏఎస్ అధికారికి అప్పట్లో ఇంటర్‌లో వచ్చిన మార్కులు వైరల్‌!

  • ట్వీట్‌లో చెప్పిన ఐఏఎస్‌ నితిన్‌ సంగ్వాన్
  • ఇంటర్‌లో రసాయన శాస్త్రంలో ఆయనకు 24 మార్కులు
  • అయినప్పటికీ ఐఏఎస్‌ అయ్యానన్న నితిన్‌
  • బోర్డు పరీక్షల ఫలితాల కంటే జీవితం చాలా విలువైనదని వ్యాఖ్య
ias marks in inter

తమ పిల్లలు బాగా చదువుకుని ఐఏఎస్‌ కావాలన్న ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు వారిని చాలా ఒత్తిడికి గురి చేస్తుంటారు. చిన్నప్పటి నుంచీ అన్ని సబ్జెక్టుల్లోనూ 90 శాతానికి పైగా మార్కులు వస్తేనే ఐఏఎస్‌ వంటి అత్యున్నత హోదాను దక్కించుకోవచ్చని భావిస్తారు. చాలా మంది విద్యార్థులు కూడా ఇదే భావనలో ఉంటారు.

అయితే, అందుకు భిన్నంగా చాలా మంది ఐఏఎస్‌ సాధించారు. ఇందుకు ఉదాహరణే అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్‌ స్మార్ట్ సిటీ సీఈవో నితిన్‌ సంగ్వాన్. తాజాగా, ఆయన తన ఇంటర్‌ మెమోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సీబీఎస్‌ఈ ఇంటర్‌లో‌ రసాయన శాస్త్రంలో ఆయనకు 24 మార్కులు మాత్రమే వచ్చాయి. ఆ సబ్జెక్టులో 23 మార్కులు వస్తే పాస్‌ అవుతారని, తనకు పాస్‌ మార్కుల కంటే ఒక్క మార్కు మాత్రమే ఎక్కువ వచ్చిందని చెప్పారు.

అయినప్పటికీ తన జీవితంలో తాను ఏం కావాలనుకుంటున్నానో దాన్ని ఈ మార్కులు నిర్ణయించలేదని పేర్కొన్నారు. మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని బాధ పెట్టొద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. పరీక్షల ఫలితాల కంటే జీవితం చాలా విలువైనదని చెప్పారు. సీబీఎస్‌ఈ ఇంటర్‌, టెన్త్‌ ఫలితాలను విడుదల చేస్తోన్న సమయంలో ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

                         

More Telugu News