వరవరరావుకి మెరుగైన వైద్యం అందించాల‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగారికి విన్న‌విస్తున్నాను: నారా లోకేశ్

15-07-2020 Wed 13:24
  • ముంబై జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావు
  • ప్రస్తుతం ఆయన వయసు 81 సంవత్సరాలు
  • మెరుగైన వైద్యాన్ని అందించాలని థాకరేను కోరిన నారా లోకేశ్
Nara Lokesh requests Maha CM to provide good medical treatment to Varavara Rao

ప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎల్గార్ పరిషద్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన... మహారాష్ట్రలోని జైల్లో ఉన్నారు. 2017 డిసెంబర్ 31న పూణెలో జరిగిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని... దీని కారణంగానే మరుసటి రోజు కోరేగాం-భీమా ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. 81 సంవత్సరాల వరవరరావు అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో... ఆయనను ముంబైలోని జేజే ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ నేపథ్యంలో వరవరరావు ఆరోగ్యంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావుకు తక్షణమే అత్యాధునిక వైద్యాన్ని అందించాలని మహా సీఎంను కోరుతున్నానని ట్వీట్ చేశారు.