కరోనాతో మృతి చెందిన అనంతపురం ట్రాఫిక్ సీఐ

15-07-2020 Wed 12:50
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి
  • సంతాపం తెలిపిన కలెక్టర్ చంద్రుడు, ఎంపీ గోరంట్ల
  • ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
Anantapur traffic CI Raja sekhar died with covid

అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ (47) కరోనా బారినపడి మృతి చెందారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తర్వాత మార్గమధ్యంలో పరిస్థితి మరింత విషమించింది. ఆ వెంటనే ఆయనను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ మృతికి కలెక్టర్ గంధం చంద్రుడు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ హామీ ఇచ్చారు. మూడు నెలలపాటు కరోనా విధులు నిర్వర్తించిన రాజశేఖర్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.