'అలిమేలుమంగ' పాత్రలో కీర్తి సురేశ్

15-07-2020 Wed 12:39
  • గోపీచంద్ హీరోగా 'అలిమేలుమంగ వేంకటరమణ'
  • పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసిన దర్శకుడు తేజ
  • గోపీచంద్ 'సీటీమార్' తర్వాత సెట్స్ కు  
Keerthi Suresh to play as Alimelumanga

నేటి యువ కథానాయికలలో చక్కని అభినయాన్ని ప్రదర్శించే ఆర్టిస్టుగా కీర్తి సురేశ్ కి పేరుంది. అందుకే, అభినయానికి ఆస్కారమున్న పాత్రలకు ఆయా దర్శకులు ఆమెను ఎంచుకుంటూ వుంటారు. తాజాగా ఆమెకు యాక్షన్ హీరో గోపీచంద్ సరసన నటించే అవకాశం వచ్చింది.

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడుగా 'అలిమేలుమంగ వేంకటరమణ' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో హీరోయిన్ గా పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ తాజాగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇన్నాళ్లు యాక్షన్ చిత్రాలలోనే ఎక్కువగా నటించిన గోపీచంద్ కి ఇది వెరైటీ అవుతుంది. ఎందుకంటే, పూర్తి ఫ్యామిలీ డ్రామాతో సాగే కథతో దీనిని తేజ రూపొందిస్తున్నారు. తాజగా స్క్రిప్టు పని మొత్తం పూర్తవడంతో, దర్శకుడు గోపీచంద్ ను కలసి వినిపించాడనీ, అది ఆయనకు బాగా నచ్చిందనీ అంటున్నారు. ఇది తనకు కచ్చితంగా విభిన్నమైన చిత్రం అవుతుందని గోపీచంద్ భావిస్తున్నాడట.

ఇక ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 'సీటీ మార్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే 'అలిమేలుమంగ..'ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.