దిగొచ్చిన ట్రంప్ సర్కారు... విద్యార్థి వీసాలపై నిబంధనల ఎత్తివేత!

15-07-2020 Wed 09:03
  • ఆన్ లైన్ విద్యార్థులు దేశం వీడాల్సిందని ఉత్తర్వులు
  • కోర్టును ఆశ్రయించిన పలు యూనివర్శిటీలు
  • వివాదాస్పద నిర్ణయం వెనక్కి
US Revokes Conditions on Online Students

యూఎస్ లోని పలు యూనివర్శిటీలు, టెక్నాలజీ దిగ్గజాలు తీసుకువచ్చిన ఒత్తిడి, పెట్టిన కేసులతో ట్రంప్ సర్కారు దిగి వచ్చింది. ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ, తీసుకుని వచ్చిన వివాదాస్పద నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. జూలై 6న యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఈ ఆదేశాలను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మరో 17 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, వర్శిటీలను తిరిగి తెరిచే విషయంలో యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరించే ధోరణిలో ఉండి, ఆన్ లైన్ క్లాసులను ప్రవేశపెట్టగా, విద్యా సంస్థలపై ఒత్తిడిని పెంచేలా ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే.