SIAM: కరోనా ఎఫెక్ట్.. కొనేవారు లేక వాహన మార్కెట్ దిగాలు!

  • తీవ్రంగా దెబ్బతిన్న కార్ల అమ్మకాలు
  • జూన్ లో 50 శాతం తగ్గిన విక్రయాలు
  • 38 శాతం పడిపోయిన టూ వీలర్ అమ్మకాలు
Vehicle Sales donw in June

మార్చి మూడో వారం నుంచి మొదలైన లాక్ డౌన్ తరువాత, వాహన అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆపై ఏప్రిల్ నుంచి మే నెల రెండో వారం వరకూ వాహనాలను కొనేవారే కరవయ్యారు. ఆ తరువాత కొంతమేరకు వాహనాల డీలర్ షిప్ కేంద్రాలు తెరచుకున్నాయి. అయినా, కొనేవారు కరవయ్యారు.

గడచిన జూన్ నెలలో అమ్మకాలు సుమారు 50 శాతం పతనమయ్యాయి. గత సంవత్సరం జూన్ లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 2,09,522 యూనిట్లు సాగగా, ఈ సంవత్సరం జూన్ లో 1,05,617 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 జూన్ తో పోలిస్తే ఇది కేవలం 49.59 శాతం మాత్రమేనని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్) వెల్లడించింది.

లాక్ డౌన్ కారణంగానే అమ్మకాలు తగ్గాయని స్పష్టం చేసిన సియామ్, ద్విచక్ర వాహన విక్రయాలు 38.56 శాతం తగ్గాయని వెల్లడించింది. గత సంవత్సరం జూన్ లో 16.50 లక్షల టూ వీలర్లు ఇండియాలో విక్రయించబడగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 10.13 లక్షలకు తగ్గిందని పేర్కొంది. మోటార్ సైకిళ్ల అమ్మకాలు10.84 లక్షల యూనిట్ల నుంచి 7.02 లక్షలకు పడిపోయాయని, స్కూటర్ల అమ్మకాలు 5.12 లక్షల నుంచి 2.69 లక్షలకు తగ్గాయని తెలిపింది.

More Telugu News