2019 నుంచే రాష్ట్రంలో ఆర్థికమాంద్యం ఉంది: బుగ్గన

14-07-2020 Tue 21:17
  • టీడీపీ హయాంలో రెండంకెల వృద్ధి ఎక్కడ జరిగిందన్న మంత్రి
  • ఎప్పుడూ అంచనాలను చేరుకోలేదని వ్యాఖ్యలు
  • యనమల లెక్కలకు పొంతన లేదని వెల్లడి
Buggana says inflation in state since last year

ఇప్పటి ఆర్థిక పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణమనే రీతిలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచే రాష్ట్రంలో ఆర్థికమాంద్యం ఉందని, గత ప్రభుత్వ అంచనాలు ఎప్పుడూ లక్ష్యాలను అందుకోలేదని అన్నారు. 2018-19లో ఎంతో ఆర్థిక ప్రగతి సాధించామని చెప్పుకున్నారని, గత ప్రభుత్వంలో రెండంకెల వృద్ధి ఎక్కడ జరిగిందని బుగ్గన ప్రశ్నించారు. మూడేళ్ల అంచనాలు వరుసగా తగ్గుతూ వచ్చాయని తెలిపారు. గతంలో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు చెప్పే లెక్కలకు పొంతనలేదని అన్నారు. టీడీపీ పాలనతో కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా అంచనాలు పెంచారని, తాము వచ్చిన తర్వాత వాటిని సరిచేశామని వెల్లడించారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో, ఓ విదేశీ సంస్థ రుణంతో పాటు గ్రాంటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్రానికి చెప్పామని, సంస్థ నుంచి రుణం తీసుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని ఆ సంస్థ పేర్కొందని వివరించారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తామంటే తీసుకోవడం తప్పా? అని నిలదీశారు.