Corona Virus: బ్లాక్ మార్కెట్లో కరోనా మందులు... గుట్టురట్టు చేసిన హైదరాబాదు పోలీసులు

  • రూ.4,500 విలువైన ఇంజెక్షన్ రూ.40 వేలకు విక్రయం
  • ఎనిమిది మంది అరెస్ట్
  • రూ.35 లక్షల విలువైన ఔషధాల స్వాధీనం
Corona medicine in black market as Hyderabad police busted

కరోనా కష్టకాలంలోనూ అవినీతి భూతం కోరలు చాచి విజృంభిస్తోంది. కొవిడ్ రోగులకు అందించాల్సిన ప్రాణాధార మందులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న విషయం బట్టబయలైంది. పోలీసులు ఈ మెడికల్ రాకెట్ గుట్టురట్టు చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో హైదరాబాద్ పాతబస్తీలో దాడులు చేసి అంతర్రాష్ట్ర బ్లాక్ మార్కెట్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.35 లక్షల విలువైన అత్యంత కీలకమైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ మందుల్లో అత్యధికంగా ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్), స్డాండర్డ్ క్యూకోవిడ్-19 ఎల్జీఎం, రెమ్ డెసివిర్  వంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. రూ.4,500 విలువైన ఇంజెక్షన్ ను ఈ ముఠా రూ.40 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్నారు. రూ.10 వేల విలువైన ఔషధాలను రూ.50 వేలకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా ఉన్నాయి.

ఈ ముఠాకు వెంకట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడని, మెడికల్ రిప్రజంటేటివ్స్ ద్వారా ఈ కరోనా ఔషధాలను మార్కెట్లోకి పంపిస్తున్నారని, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో బ్లాక్ మార్కెటింగ్ కు సహకరించవద్దని మెడికల్ డిస్ట్రిబ్యూటర్లకు, డీలర్లకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

More Telugu News