రెండు కొత్త షోలు చేయబోతున్నా... నన్ను నవ్వించినవాళ్లకు బంపర్ చాన్స్: నాగబాబు

14-07-2020 Tue 19:56
  • రెండు వేర్వేరు కార్యక్రమాలు తీసుకువస్తున్న నాగబాబు
  • టీమ్ లీడర్లుగా ఇద్దరు హాస్యనటులు
  • ప్రతిభ చూపిన వారికి ఓటీటీల్లో అవకాశం
Nagababu announces new shows to encourage fresh talent

కొత్త హాస్యనటులను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తనను నవ్వించినవారికి బంపర్ అవకాశం ఉంటుందని నటుడు నాగబాబు తెలిపారు. త్వరలోనే రెండు కొత్త షోలు తీసుకువస్తున్నామని, వాటిలో ఒకటి 'అదిరింది', 'జబర్దస్త్' తరహా కార్యక్రమం అని, ఇందులో స్కిట్లు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. రెండోది స్టాండప్ కామెడీ షో అని వివరించారు. వేదికపైకి వచ్చే కంటెస్టెంట్లు తమ ప్రతిభతో జడ్జిలను ఆకట్టుకోవాల్సి ఉంటుందని నాగబాబు చెప్పారు. ఇతర భాషల్లో అనేక మంది స్టాండప్ కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారని, కానీ తెలుగులో అలాంటి కళాకారులు లేరన్న వెలితి కనిపిస్తోందని నాగబాబు అభిప్రాయపడ్డారు.

ఇద్దరు తెలుగు సినీ కమెడియన్లు ఈ రెండు షోలకు సంబంధించిన  వివరాలు రేపు, ఎల్లుండి వెల్లడిస్తారని, కళాకారుల నుంచి తాము ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనుకోవడంలేదని అన్నారు. ఇలాంటి షోలు నిర్వహించే కొందరు ఆర్టిస్టుల నుంచి ఫీజులు వసూలు చేస్తారని, తాము అలా చేయడంలేదని అన్నారు. తమ కార్యక్రమాల్లో బాగా ప్రతిభ చూపిన వారికి ఓటీటీ వేదికల్లో అవకాశం వస్తుందని చెప్పగలనని ఆయన ఓ వీడియోలో వివరించారు.