Jayapradeep: కరోనా ప్రభావంతో విడిపోయిన ఆవును, ఎద్దును కలిపిన పన్నీర్ సెల్వం కుమారుడు

Son of Panneerselvam makes cow and an ox reunion in Tamilnadu
  • కరోనా దెబ్బకు కుదేలైన రైతు
  • తన ఆవును మరో వ్యక్తికి విక్రయం
  • గ్రామంలోని ఓ ఎద్దుతో ఆవుకు స్నేహం
  • ఆవును మరో ఊరికి తరలిస్తుండగా అడ్డుకున్న ఎద్దు
కరోనా భూతం ప్రజల సామాజిక జీవనాన్ని కూడా భగ్నం చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా మార్కెట్లు లేక, పంటలు అమ్ముకునే మార్గం లేక రైతులు విలవిల్లాడుతున్నారు. తమిళనాడులోని ఓ రైతు కూడా కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుంగిపోయాడు. దాంతో తన వద్ద ఉన్న ఆవును మరో ఊరికి చెందిన వ్యక్తికి అమ్మేశాడు. ఆ ఆవును వాహనంలో తరలిస్తుండగా, అక్కడే స్థానికంగా ఓ ఆలయంలో ఉండే ఎద్దు పరుగుపరుగున వచ్చింది.

ఆ వాహనం చుట్టూ తిరుగుతూ ముందుకు కదలకుండా చేసేందుకు ప్రయత్నించింది. ఆ ఎద్దు అలా చేయడానికి బలమైన కారణమే ఉంది. రైతుకు చెందిన ఆ ఆవు, ఆలయం వద్ద ఉండే ఎద్దు మధ్య మంచి చెలిమి ఏర్పడింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆవును తన నుంచి దూరం చేస్తుండడంతో భరించలేని ఆ ఎద్దు గంటసేపు హంగామా సృష్టించింది. ఎలాగోలా ఆ వాహనం బయల్దేరడంతో ఎద్దు దాని వెంబడే పరుగులు తీసింది. అయితే ఈ వీడియో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చిన్నకుమారుడు జయప్రదీప్ కంటపడింది.

ఆవు పట్ల ఎద్దు చూపిస్తున్న ప్రేమ జయప్రదీప్ ను కదిలించింది. దాంతో ఆ ఆవును కొనుగోలు చేసి సదరు గ్రామంలోని ఆలయ కమిటీకి అప్పగించాడు. దాంతో ఆవు, ఎద్దు మళ్లీ ఒక్కటయ్యాయి. జయప్రదీప్ చొరవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మూగజీవాల పట్ల ఆయన స్పందనను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు.
Jayapradeep
Panneerselvam
Cow
Ox
Farmer
Corona Virus
Tamilnadu

More Telugu News