Revanth Reddy: సచివాలయం కింద నిజాం ఖజానా ఉంది.. గుప్త నిధుల కోసమే కేసీఆర్ కూల్చుతున్నారు: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ కనిపించకపోవడంపై అనుమానాలు ఉన్నాయి
  • ఖజానా ఉందనే విషయానికి సంబంధించి నివేదికలు ఉన్నాయి
  • దీనిపై హైకోర్టు అత్యవసరంగా విచారణ జరపాలి
Secretariat being demolished for treasure says Revanth Reddy

తెలంగాణ పాత సెక్రటేరియట్ కూల్చివేత అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం కింద ఉన్న గుప్త నిధుల కోసమే దానిని కూలుస్తున్నారని ఆరోపించారు. 11 రోజుల పాటు కేసీఆర్ కనిపించకుండా పోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కూల్చివేతకు అనుమతి ఇవ్వరాదంటూ జూన్ 29న తాము హైకోర్టును ఆశ్రయించామని... అయితే, కూల్చడానికి అభ్యంతరం లేదని హైకోర్టు తీర్పును వెలువరించిందని తెలిపారు. తాము కోర్టును ఆశ్రయించినప్పటి నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని... కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చిన మరుసటి రోజే ఆయన మళ్లీ కనిపించారని చెప్పారు.

సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్ల మేర రాకపోకలను బంద్ చేసి కూల్చివేతలు చేశారని రేవంత్ అన్నారు. తమకు అనుమానం వచ్చి లోతుగా విచారిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగు చూశాయని, నిధి కోసమే కూల్చివేస్తున్నారని తెలిసిందని చెప్పారు. సచివాలయంలోని జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందని, నేల మాళిగల్లో నిజాం నిధులను దాచుకున్నాడని, దీనికి సంబంధించి నివేదికలు ఉన్నాయని, గతంలో పత్రికలు కూడా ప్రచురించాయని తెలిపారు. సొరంగాల కేంద్రం జీ బ్లాక్ కింద ఉందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించిందని... అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని గతంలోనే జీహెచ్ఎంసీకి లేఖ రాసిందని చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వలేదని... అదే సమయంలో లేఖ రాసిన అధికారిని పదవి నుంచి తొలగించారని తెలిపారు.

పురావస్తు శాఖ పర్యవేక్షణలో కూల్చివేతలను ఎందుకు చేపట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. పోఖ్రాన్ అణు పరీక్షలను కూడా ఇంత రహస్యంగా చేపట్టలేదని అన్నారు. ఇది లక్షల కోట్ల విలువైన సంపదకు సంబంధించిన అంశమని... దీనిపై తాము హైకోర్టులో పిటిషన్ వేస్తామని, అత్యవసరంగా దీన్ని విచారించాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని అన్నారు. జీ బ్లాక్ కింద గుప్తనిధులు ఉన్నట్టు కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో కూడా వార్తలు వచ్చాయని గుర్తు చేశారు.

More Telugu News