Ashok Gehlot: సచిన్ పైలట్ చేతుల్లో ఏమీలేదు... అంతా బీజేపీనే నడిపిస్తోంది: అశోక్ గెహ్లాట్

  • పైలట్ బీజేపీ కుట్రలో చిక్కుకున్నాడని వెల్లడి
  • రెబెల్ ఎమ్మెల్యేల కోసం బీజేపీ రిసార్ట్ ఏర్పాటు చేసిందన్న గెహ్లాట్
  • బీజేపీ ఆటకట్టించామంటూ వ్యాఖ్యలు
Ashok Gehlot comments on Sachin Pilot and BJP

రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో ఇవాళ కీలక పరిణామాలు జరిగాయి. సంక్షోభానికి కారకుడైన సచిన్ పైలట్ ను కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. మరో ఇద్దరు మంత్రుల పైనా వేటు వేసింది. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ,  బీజేపీ కుట్రలో చిక్కుకున్న సచిన్ పైలట్ తప్పుదారి పట్టాడని ఆరోపించారు.

"ఇక్కడ సచిన్ పైలట్ చేతుల్లో ఏమీ లేదు, మొత్తం బీజేపీనే నడిపిస్తోంది. తిరుగుబాటుదారుల కోసం రిసార్ట్ ఏర్పాటు చేసింది, అనేక రకాలుగా వ్యవహారం నడిపింది కూడా బీజేపీనే. గతంలో మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సమయంలో ఏ బీజేపీ బృందం అయితే పనిచేసిందో, ఇప్పుడు రాజస్థాన్ లోనూ అదే బృందం పనిచేస్తోంది. కానీ మావద్ద బీజేపీ పప్పులు ఉడకవు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధన రాజకీయాలు చేయాలనుకున్నారు, రాజస్థాన్ లోనూ అదే చేయొచ్చనుకుంటున్నారు. అయితే ఈ బహిరంగ క్రీడలో వారు ఓడిపోయారు అనుకుంటున్నాను" అంటూ అశోక్ గెహ్లాట్ వివరించారు.

అంతేకాదు, ఇటీవల సచిన్ పైలట్, ఆయన మద్దతుదారులైన కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీలో వారాంతం గడిపి వచ్చారని వ్యాఖ్యానించారు. "ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు, బీజేపీకి మధ్య ఒప్పందం కుదిరింది. వాళ్లు ఇప్పుడేం చేస్తారో చూడాలి! తాత్కాలికంగా ఓ పార్టీ పెడతారో, లేక నేరుగా బీజేపీలో చేరతారో త్వరలోనే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు.

More Telugu News