టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్

14-07-2020 Tue 15:37
  • నేను సంచయిత గజపతి అంటూ ట్వీట్
  • గజపతి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ వ్యాఖ్యలు
  • రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి
Sanchaita counters Chandrababu comments on Mansas Trust

అనంత పద్మనాభస్వామి ఆలయ పాలన హక్కులు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేస్తూ, ఏపీలో సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు సంరక్షకులుగా గజపతి కుటుంబీకుల హక్కులను కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి వెంటనే బదులిచ్చారు.

"నన్ను చైర్ పర్సన్ గా నియమించడం వల్ల సింహాచలం, మాన్సాస్ ట్రస్టులపై గజపతి కుటుంబ హక్కులు పూర్తిగా సంరక్షింపబడుతున్నాయి చంద్రబాబు గారూ" అంటూ కౌంటర్ ఇచ్చారు.

"నేను సంచయిత గజపతిని, నా తండ్రి ఆనంద గజపతికి అన్ని విధాలా న్యాయపరమైన వారసురాలిని. మా తాతగారైన మహారాజా పీవీజీ రాజు గారికి మా తండ్రి ఆనంద గజపతి న్యాయపరమైన వారసుడు, మా తండ్రి ఆనంద గజపతికి నేను వారసురాలిని. చంద్రబాబు గారూ... గజపతి కుటుంబం మొత్తానికి తానే వారసుడ్నని చెప్పుకుంటూ అహంభావం చూపుతున్న అశోక్ గజపతిలా కాకుండా, మీరు లింగ సమానత్వంపై గౌరవం చూపుతారని భావిస్తున్నాను.

నేను గజపతి కుటుంబానికి చెందిన దాన్నే కాదంటూ అశోక్ గజపతి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాడు. ఈ వ్యవహారాలను రాజకీయం చేయకుండా, గజపతి కుటుంబ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మిమ్మల్ని తప్పకుండా అభినందిస్తాను" అంటూ సంచయిత ట్విట్టర్ లో స్పందించారు.