పదవుల నుంచి సచిన్ పైలట్ తొలగింపు.. కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్ణయం
- డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసన
- మరో ఇద్దరు మంత్రులపైనా వేటు
- ప్రకటించిన రణదీప్ సూర్జేవాలా
అశోక్ గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం రాజుకుంది. దీనిపై చర్చించేందుకు సీఎల్పీ రెండు పర్యాయాలు సమావేశమైంది. సీఎల్పీ భేటీకి రావాలంటూ రెండుసార్లు ఆహ్వానించినా సచిన్ పైలట్ నుంచి జవాబు రాకపోవడంతో ఆయనను సాగనంపడమే మంచిదని పార్టీ తీర్మానించింది. సచిన్ పైలట్ పై వేటు వేసే తీర్మానానికి సభ్యులందరూ ముక్తకంఠంతో సరేననడంతో అధిష్ఠానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.
దీనిపై రాష్ట్ర గవర్నర్ కు నివేదించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్లారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ను, మరో ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ కు తెలియజేశారు.