నోయిడాలో సూపర్ కవలలు... టోటల్ మార్కులే కాదు ప్రతి సబ్జెక్టులోనూ ఒకే మార్కులు!

14-07-2020 Tue 13:39
  • సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెల్లడి
  • 98.5 శాతం మార్కులు తెచ్చుకున్న మానసి, మాన్య
  • పుట్టినసమయం ఒక్కటే తేడా!
  • అన్నింట్లో ఒకేలా ఉంటూ విస్మయానికి గురిచేస్తున్న వైనం
Noida twins gets equal marks in CBSE results

ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు పుట్టడం ఎంతో అరుదైన విషయం. ఆ విధంగా జన్మించే కవలల రూపురేఖలు ఒకేలా కనిపిస్తాయి. కొందరిలో అభిరుచులు సైతం ఒకేలా ఉంటాయి. నోయిడాకు చెందిన మానసి, మాన్య కూడా ఇలాంటి కవలలే. అయితే, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వెల్లడి అనంతరం వీరిద్దరూ జాతీయస్థాయిలో ఆసక్తికర అంశంగా మారారు. సోమవారం సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ వెల్లడి కాగా, మానసి, మాన్య ఇద్దరికీ సరిగ్గా 95.8 శాతం మార్కులు వచ్చాయి. అంతేనా అనుకోకండి, ప్రతి సబ్జెక్టులోనూ ఇద్దరికీ మార్కులు సేమ్ టు సేమ్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ కవలలు సైన్స్ గ్రూప్ తీసుకున్నారు. కాగా, ఫిజిక్స్ లో మానసి ఎంతో మెరుగైన విద్యార్థిని కాగా, మాన్య కెమిస్ట్రీలో చురుగ్గా ఉండేది. కానీ ఫైనల్ మార్కులు మాత్రం సమానంగా రావడం విశేషం. రూపురేఖలే కాదు, ఇద్దరి గొంతులూ, ఇద్దరి ఆహారపు అలవాట్లు, క్రీడలపై ఆసక్తి, ఇతర అభిరుచుల పరంగా ఇష్టాయిష్టాలు అన్నీ ఒకటే. ఇప్పుడు 12వ తరగతిలో టోటల్ మార్కులే కాకుండా ప్రతి సబ్జెక్టులోనూ సమానమైన మార్కులు తెచ్చుకోవడం తల్లిదండ్రులను, బంధుమిత్రులను, స్కూలు టీచర్లను విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని నిమిషాల తేడాతో జన్మించినందువల్ల పుట్టినసమయం ఒక్కటే తేడా తప్ప అన్నింట్లోనూ మానసి, మాన్య ఒకేలా ఉండడం నిజంగా విశేషమే!