రేపు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

14-07-2020 Tue 13:14
  • ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ విడుదల
  • పెండింగ్ లో ఉన్న పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ
  • ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడి
CBSE will announce Tenth class results tomorrow

ఇప్పటికే 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) రేపు 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ విషయం వెల్లడించారు. "ప్రియతమ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులారా... రేపు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు ప్రకటిస్తున్నారు. విద్యార్థులందరికీ బెస్టాఫ్ లక్" అంటూ రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.

కరోనా సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ పరీక్షలపై కొన్నిరోజులుగా తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కొన్ని పరీక్షలు నిలిచిపోవడంతో వాటికి రీషెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కరోనా పరిస్థితుల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు జరపడం సమంజసం కాదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో, పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించుకుంది.