షూటింగులు వద్దు బాబోయ్ అంటున్న టాప్ యాంకర్లు!

14-07-2020 Tue 12:42
  • ఎంటర్టైన్ మెంట్ రంగంపై కరోనా పంజా
  • కరోనా బారిన పడ్డ పలువురు బుల్లితెర నటులు
  • షూటింగులకు దూరంగా ఉండాలనుకుంటున్న సుమ, అనసూయ
Telugu top anchors Suma and Anasuya decides to stay away from shootings

కరోనా కారణంగా తెలుగు సినిమాలు, సీరియల్స్, టీవీ షోల షూటింగులు రోజుల తరబడి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతితో మళ్లీ షూటింగులు ప్రారంభమయ్యాయి. అయితే, షూటింగుల సందర్భంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... యూనిట్ సభ్యులు కరోనా బారిన పడుతుండటం కలవర పెడుతోంది. పలువురు టీవీ ఆర్టిస్టులకు ఇప్పటికే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వారంతా క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, షూటింగులకు వెళ్లేందుకు పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు బుల్లితెర స్టార్లుగా వెలుగొందుతున్న యాంకర్లు సుమ, అనసూయ కూడా షూటింగులు వద్దు బాబోయ్ అంటున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు మరికొన్ని రోజుల పాటు షూటింగులకు దూరంగా ఉండాలని వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే... షూటింగులు దాదాపు ప్రారంభం కాలేదనే చెప్పుకోవాలి. రెండు, మూడు సినిమాల షూటింగులు జరుగుతున్నప్పటికీ... ఇతర ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కలేదు. ముఖ్యంగా షూటింగులకు రావడానికి హీరోలు సుముఖంగా లేరని తెలుస్తోంది. అనవసరమైన రిస్క్ ఎందుకనే భావనలో సినీ ప్రముఖులు ఉన్నారు.