ఎమ్మెల్యే మృతిపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం.. పశ్చిమ బెంగాల్‌లో బస్సుల ధ్వంసం.. రోడ్లు దిగ్బంధం

14-07-2020 Tue 11:22
  • ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే
  • హత్యేనని ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్న బీజేపీ
  • రోడ్డెక్కిన బీజేపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత
BJP Hits Streets Over MLAs Death

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే మృతితో పశ్చిమ బెంగాల్ రగలిపోతోంది. ఆయన మృతితో 12 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కుచ్‌బెహర్ ప్రాంతంలో బస్సులు ధ్వంసం చేశారు. రోడ్లు ఎక్కడికక్కడ దిగ్బంధించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో మార్కెట్లు మూతపడ్డాయి.

బీజేపీ కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొడుతున్నారు. కాగా, ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ తన గ్రామ సమీపంలోని బిందాల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, అది ఆత్మహత్య కాదని, హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని పశ్చిమ బెంగాల్‌ బీజేపీకి కేంద్ర పరిశీలకుడు అయిన కైలాశ్ విజయ్ వర్గీయ డిమాండ్ చేశారు.