ఐదు రోజులుగా కనిపించని హాలీవుడ్ నటి.. నదిలో శవమై తేలిన వైనం!

14-07-2020 Tue 10:22
  • ఐదు రోజుల క్రితం బోటు షికారుకు వెళ్తూ అదృశ్యం
  • నాలుగేళ్ల కుమారుడిని బోటులోనే వదలేసి ఆత్మహత్య
  • ఐదు రోజుల గాలింపు తర్వాత బయటపడిన మృతదేహం
Actress Naya Riveras Body Found

ఐదు రోజుల క్రితం అదృశ్యమైన హాలీవుడ్ ప్రముఖ నటి నయా రివీరా మృతదేహం పెరూలేక్‌లో తేలియాడుతూ కనిపించింది. రివీరా ఐదు రోజుల క్రితం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌కు వెళ్లి ఓ బోటును అద్దెకు తీసుకుంది. అనంతరం దానితో షికారుకు వెళ్లిన ఆమె సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో బోటు యజమాని వెంటనే పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. బోటు కోసం గాలిస్తున్న సిబ్బందికి బుధవారం సాయంత్రం బోటు కనిపించింది. అందులో పిల్లాడు ఒక్కడే పడుకుని ఉండడంతో విస్తుపోయారు. బోటులో లైఫ్ జాకెట్, రివీరా పర్సును గుర్తించారు.

తాను, అమ్మ ఈత కొట్టడానికి వెళ్లామని, తాను వచ్చినా అమ్మ తిరిగి రాలేదని చిన్నారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించారు. దీంతో ఆమె మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఐదు రోజుల గాలింపు తర్వాత నిన్న సాయంత్రం రివీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.