20 నిమిషాల్లో ఫుల్ బాటిల్ ఖాళీ చేయాలని పందెం.. తాగుతూ కుప్పకూలి మరణించిన యువకుడు

14-07-2020 Tue 10:09
  • నిర్మల్ జిల్లాలో ఘటన
  • మూడో క్వార్టర్ బాటిల్ తాగుతూ కుప్పకూలిన యువకుడు
  • రెచ్చగొట్టిన యువకులపై కేసు నమోదు
Man died while drinking liquor in Telangana

మందు పందెం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఫుల్ బాటిల్‌ను 20 నిమిషాల్లో ఖాళీ చేస్తే 20 వేల రూపాయలు ఇస్తామంటూ స్నేహితులు చేసిన చాలెంజ్‌ను స్వీకరించిన యువకుడు మందు తాగుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ జిల్లాలో జరిగిందీ ఘటన.  

పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మణచాంద మండలం చింతలచాందకు చెందిన షేక్ ఖాజారసూల్ (31) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. నిన్న ఖాజా, మరో నలుగురు స్నేహితులు కలిసి మామడ మండలం అనంతపేటలో పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఒక ఫుల్ బాటిల్ ఖాళీ చేసిన తర్వాత మాటల మధ్యలో ఓ పందెం వేసుకున్నారు. 20 నిమిషాల్లో ఫుల్ బాటిల్ ఖాళీ చేస్తే 20 వేలు ఇస్తామంటూ స్నేహితులు రత్తయ్య, నాగూర్ బాషాలు పందెం విసిరారు.

నేను తాగుతానంటూ ముందుకొచ్చిన ఖాజా.. రెండు  క్వార్టర్ సీసాలు ఖాళీ చేసి మూడోది తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిపోయిన సహచరులు వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి నిర్మల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఖాజా మృతి చెందాడు. పందెం కాసిన రత్తయ్య, నాగూర్ బాషాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఖాజాది ఏపీలోని ప్రకాశం జిల్లా అని పోలీసులు తెలిపారు.