విశాఖపట్టణంలో మళ్లీ కలకలం.. ఫార్మాసిటీలో భారీగా అగ్ని ప్రమాదం.. 10 కిలోమీటర్ల వరకు శబ్దాలు!

14-07-2020 Tue 06:32
  • విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో పేలిన రియాక్టర్
  • 50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడిన మంటలు
  • ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
Another fire accident in visakha Pharma city

విశాఖపట్టణంలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్’ సంస్థలో గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఇవి రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలిపోయాయి. దాదాపు పది కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయంటే ప్రమాద తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనతో విశాఖ వాసులు మళ్లీ వణికిపోయారు. 50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

మంటల తీవ్రతకు ఫార్మా సిటీకి సమీపంలోని హెచ్‌టీ విద్యుత్ లైన్లు కూడా తెగి కిందపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు బయటకు వచ్చి భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా నల్లని పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడడం మినహా ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
పేలుడు సమాచారం అందుకున్న వెంటనే విశాఖ, అనకాపల్లి నుంచి 12 భారీ అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, మంటల వేడికి కంపెనీ వద్దకు చేరుకునేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో నలుగురు మాత్రమే పనిచేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది.

తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరరావు అనే వ్యక్తితోపాటు మిగతా ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. భారీ ఎత్తున రసాయనాలను నిల్వ చేయడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పరిశ్రమ ఆవరణలో ఉన్న ఐదు రియాక్టర్లలో ఒకదానిలో పేలుడు సంభవించినట్టు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.