ఆత్మహత్యకు ముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లావణ్య లహరి రికార్డు చేసిన మరో వీడియో ఇదిగో!

13-07-2020 Mon 21:06
  • ఇటీవల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లావణ్య లహరి ఆత్మహత్య
  • భర్త వెంకటేశ్ పై ఆరోపణలు
  • మరో అమ్మాయి మోజులో కాపురంలో చిచ్చు

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లావణ్య లహరి ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ప్రేమవివాహం చేసుకుని కూడా ఆమె భర్త చేతిలో అనుభవించిన నరకయాతన తాజాగా మరో వీడియోలో వెల్లడైంది. మరో అమ్మాయి మోజులో భర్త వెంకటేశ్ తనను ఏ విధంగా మోసగించాడో, ఎంత బాధపెట్టాడో లావణ్య లహరి ఆ వీడియోలో వివరించింది. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రేమ కోసం ఏదైనా చేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడని, కానీ పెళ్లి తర్వాత నిజస్వరూపం బయటపెట్టుకున్నాడని ఆరోపించింది. తాను గర్భంతో ఉన్నప్పుడు మరో అమ్మాయితో అఫైర్ కొనసాగించాడని వెల్లడించింది. తన ఎదుటే పరాయి అమ్మాయిలతో వీడియో కాల్ లో మాట్లాడేవాడని, ప్రశ్నించినందుకు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడని లావణ్య లహరి వివరించింది.

"నీకు ఉద్యోగం లేకపోయినా ఏళ్ల తరబడి పోషించాను. ఎన్నో ఆశలతో నీతో జీవితం ఊహించుకున్నాను. కానీ మరో అమ్మాయితో తిరుగుతున్నావు. ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావు? ఇకపై నేనుండను కాబట్టి ఆ అమ్మాయినైనా పెళ్లి చేసుకో. నా సంపాదన అంతా నీ పేరుమీదే వేసుకున్నావు. డాడీ, వీడి నుంచి రూ.48 లక్షలు తీసుకోండి. మీరంతా ఎంతగానో నన్ను ప్రేమించారు డాడీ. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆఖరికి ఈ వెధవ అన్నా చాలా ఇష్టం... కానీ వెళ్లిపోతున్నా" అంటూ లావణ్య లహరి తాజా వీడియోలో తన ఆవేదన వెలిబుచ్చింది.