రాహుల్ అసూయ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది: ఉమాభారతి

13-07-2020 Mon 19:04
  • రాజస్థాన్ లో రాజకీయం సంక్షోభం
  • అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలెట్ తిరుగుబాటు
  • పైలెట్ బీజేపీలోకి వస్తానంటే సంతోషిస్తానన్న ఉమాభారతి
Umabharathi comments on Rahul Gandhi in the sidelines of Rajasthan political crisis

రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీ మహిళా నేత ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆ పార్టీలోని యువనేతలంటే అసూయ అని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణం రాహులేనని ఆరోపించారు. ముఖ్యంగా జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలెట్ అంటే రాహుల్ కు అసూయ అని తెలిపారు. యువనేతలకు అవకాశం ఇస్తే తాను మరుగున పడిపోతానని రాహుల్ భావిస్తుంటాడని వివరించారు. సింథియా, పైలెట్ లను తాను మేనల్లుళ్లుగా భావిస్తానని, పైలెట్ కూడా బీజేపీలోకి వస్తానంటే సంతోషిస్తానని తెలిపారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలెట్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడక్కడ బలాబలాల అంశం కీలకంగా మారింది.