క్లినికల్ ట్రయల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్న చైనా

13-07-2020 Mon 15:25
  • కరోనా వ్యాక్సిన్ తయారుచేసిన చైనా సంస్థ కాన్సినో బయోలాజిక్స్
  • చైనాలో తగ్గిన కరోనా తీవ్రత
  • క్లినికల్ ట్రయల్స్ కు అనువుగా లేని పరిస్థితి
  • కేసులు అధికంగా ఉన్న రష్యా, బ్రెజిల్ దేశాలతో కాన్సినో చర్చలు
China talks other nations to conduct clinical trials

చైనాలో ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టింది ఇక్కడే. అయితే ఇప్పుడు చైనాలో వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. దాంతో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుకూల పరిస్థితి లేదు. చైనాకు చెందిన కాన్సినో బయోలాజిక్స్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంది.

అయితే చైనాలో ఇప్పుడు కరోనా తీవ్రత లేకపోవడంతో, క్లినికల్ ట్రయల్స్ కు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రష్యా, చిలీ, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాలతో కాన్సినో బయోలాజిక్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. తమకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం సుమారు 40 వేల మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చి, ఫలితాలను మదింపు చేయాలని కాన్సినో బయోలాజిక్స్ భావిస్తోంది.