Narendra Modi: సుందర్ పిచాయ్ తో చర్చ ఫలవంతంగా సాగింది: ప్రధాని మోదీ

  • మోదీ, పిచాయ్ సంభాషణ
  • అనేక అంశాలపై మాట్లాడుకున్నామని మోదీ వెల్లడి
  • ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన గూగుల్ సీఈవో
PM Narendra Modi interacts with Google CEO Sundar Pichai

ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో చర్చ జరిపారు. ఈ చర్చ ఎంతో ఫలవంతంగా సాగినట్టు మోదీ వెల్లడించారు. విస్తృత స్థాయిలో అనేక అంశాలపై మాట్లాడుకున్నామని, ముఖ్యంగా, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, యువత, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింప చేయడంపైనా ఆసక్తికర చర్చ జరిగిందని తెలిపారు.

"ఈ సంభాషణ సందర్భంగా, కరోనా పరిస్థితుల్లో సరికొత్త తరహా ఉద్యోగ సంస్కృతి ఏర్పడడంపై ప్రస్తావన వచ్చింది. ఈ కరోనా మహమ్మారి క్రీడారంగంతో పాటు అనేక రంగాలను కూడా ప్రభావితం చేయడంపై చర్చించుకున్నాం. డేటా భద్రత, ఇంటర్నెట్ రక్షణ అంశాల ప్రాధాన్యత గురించి కూడా మాట్లాడుకున్నాం. విద్య, విజ్ఞానం, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాల్లో గూగుల్ చేపడుతున్న చర్యలు ముగ్ధుడ్ని చేశాయి" అంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై సుందర్ పిచాయ్ స్పందిస్తూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మా కోసం ఎంతో విలువైన సమయం కేటాయించారంటూ ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. "డిజిటల్ ఇండియా కోసం మీ తపన ఎంతో ఆశావహ భావన కలిగిస్తోంది. ఈ దిశగా గూగుల్ తన కృషిని కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది" అంటూ స్పందించారు. కాగా, గూగుల్ భారత్ లో భవిష్యత్ ప్రణాళికల కోసం రూ.75 వేల కోట్ల మేర పెట్టుబడులు ప్రకటించినట్టు తెలుస్తోంది.

More Telugu News