కరోనా పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడండి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

13-07-2020 Mon 14:21
  • యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ వస్తే వెంటనే చికిత్స
  • నెగెటివ్ వస్తే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని సూచన
  • ప్రతి జిల్లాకు 20 వేల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు
AP health ministry orders to conduct rapid antigen tests for corona suspects

ఏపీలో కరోనా పరీక్షల తీరుతెన్నులపై వైద్య ఆరోగ్య శాఖ మరోమారు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేసేందుకు తొలుత ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని సూచించింది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ వస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలని, ఒకవేళ లక్షణాలు ఉండి నెగెటివ్ వస్తే వెంటనే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని తెలిపింది. దాంట్లోనూ నెగెటివ్ వస్తే రియల్ టైమ్ ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని వివరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక్కో జిల్లాకు 20 వేల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు పంపినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. హైరిస్క్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో కరోనా టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేపట్టాలని పేర్కొంది.