High Court: పార్టీ పేరు వివాదం: వైఎస్సార్సీపీతో పాటు ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు

Delhi High Court sends notices to YSRCP and Election Commission
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదేనంటున్న మహబూబ్ బాషా
  • బాషా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
  • వైఎస్సార్ పేరిట రిజిస్టరైన పార్టీ తమదేనని వెల్లడి
వైఎస్సార్సీపీ పేరు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందంటూ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, తమదే నిజమైన 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' అని మహబూబ్ బాషా కోర్టుకు తెలిపారు. 'వైఎస్సార్' పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్' ఒక్కటేనని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తమ పార్టీ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఆయన ఆరోపించారు. జగన్ అధ్యక్షుడిగా వున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
High Court
YSRCP
ECI
Notice
Anna YSR Congress Party
Andhra Pradesh

More Telugu News