ఉరి వేసుకున్న బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే.. హత్య చేశారంటున్న బీజేపీ!

13-07-2020 Mon 13:26
  • ఇంటి సమీపంలో ఉరేసుకున్న పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే
  • 2019లో బీజేపీలో చేరిన ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్
  • హత్య చేసి, ఆ తర్వాత ఉరి వేశారన్న బీజేపీ
BJP MLA Debendranath Roy commits suicice

పశ్చిమబెంగాల్ లో ఘోరం సంభవించింది. దేవేంద్రనాథ్ రాయ్ అనే బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నారు. దినాజ్ పూర్ లోని ఓ మార్కెట్లో ఉరి వేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఎందుకు ఉరి వేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ హత్యేనని మండిపడింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఉత్తర దీనాజ్ పూర్ లోని రిజర్వుడు స్థానమైన హేమతాబాద్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తన ఇంటి సమీపంలో ఉరి వేసుకున్నట్టు పోలీసులు గుర్తించారని.. ఆయనను ఎవరో చంపి, ఆ తర్వాత ఉరి వేశారని తెలిపింది. 2019లో ఆయన బీజేపీలో చేరారని... ఇదే ఆయన చేసిన తప్పేమో? అని ట్వీట్ చేసింది.

ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ గవర్నర్ స్పందిస్తూ, ఎమ్మెల్యేను హత్య చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు ఉండకూడదని, ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.